పులివెందుల వైసీపీలో భయం.. క్యాడర్ లో అయోమయం
posted on Aug 10, 2025 12:41PM
.webp)
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక భయం పట్టుకుంది. పులివెందుల పులి.. పులివెందులలో తిరుగే లేదు అని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఓటమి ఖాయమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైతే.. ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే..పులివెందుల అంటే వైఎస్ కంటుకోట.. వైఎస్ తదననంతరం జగన్ కంచుకోట అని ఇంత కాలం చెప్పుకుంటూ తిరిగిన వైసీపీ నేతలకు ఇప్పుడు అక్కడే ఎదురు గాలి వీచడం జీర్ణం కావడం లేదు.
ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం, అదీ ఆరునెలలు మాత్రమే ఉండే పదవి కోసం వైసీపీ యంత్రాంగం మొత్తం పులివెందులలో తిష్ట వేసింది. అయినా విజయం పట్ల ధీమా కరవై కంగారెత్తిపోతున్నది. పులివెందుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగి దశాబ్దాలు దాటిపోయింది. ఇక్కడ జగన్ కు, ఆయన పార్టీకి ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడానికే భయపడే పరిస్థితి ఉండేది. దాదాపుగా ఇక్కడ స్థానిక ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇక్కడ తెలుగుదేశం కూటమి అభ్యర్థిని నిలపడమే కాదు, గెలిపించుకుంటామని కూడా ధీమాగా ఉంటే.. ఇంత కాలం ఇక్కడ తమదే రాజ్యమని విర్రవీగిన వైసీపీయులు తమపై దాడులు జరుగుతున్నాయంటూ డ్రామాలు ఆరంభించేశారు.
ఈసీ వద్దకు వెళ్లి రక్షణ కావాలని మొరపెట్టుకుంటున్నారు. రిగ్గింగు చేసుకునే అవకాశం లేకుండా పోలింగ్ స్టేషన్లను మార్చేశారని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇక్కడి జనం మాత్రం ఇన్నాళ్లకు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకుల విశ్లేషణల ప్రకారం వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఆయనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో పరాజయం ఎదురైతే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై పడుతుందని జగన్ కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాను స్వయంగా పులివెందులలో ప్రచారానికి రాకపోయినా.. బెంగళూరు ప్యాలస్ నుంచి నిరంతరం ప్రచార తీరును పరిశీలిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు. ఎంతగా దిశానిర్దేశం చేసినా పరిస్థితి అనుకూలంగా కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇక భయపెట్టి గెలిచేద్దామనుకుంటే.. పటిష్ట పోలీసు బందోబస్తు ఆ అవకాశం లేకుండా చేస్తున్నది. ఏది ఏమైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వస్తే..పార్టీ నుంచి వలసలు ఊహించని స్థాయిలో మొదలౌతాయన్న భయం పార్టీ అగ్రనాయతక్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.